: భారత్ పై గెలిచేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తాం: పాక్ కెప్టెన్ మిస్బా
వన్డే వరల్డ్ కప్ చరిత్రలో భారత జట్టుపై పాకిస్థాన్ గెలిచింది లేదు. దాయాదులు ఐదు పర్యాయాలు తలపడగా అన్నింటా భారత జట్టుదే విజయం. ఈ నేపథ్యంలో, పాక్ జట్టు చరిత్ర మార్చేందుకు తహతహలాడుతోంది. ఈ రెండు జట్లు ఫిబ్రవరి 15న అడిలైడ్ లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈసారి భారత్ ను ఓడించాలని ఆ జట్టు ఆటగాళ్లు కృతనిశ్చయంతో ఉన్నారు. కెప్టెన్ మిస్బా-ఉల్-హక్ మీడియాతో మాట్లాడుతూ, చరిత్ర మార్చేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తామని చెప్పాడు. ఇంతకుముందు భారత్ చేతిలో పరాజయాలకు ఒత్తిడి కారణమై ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ఇక, పాక్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది గెలుపుపై ధీమా వ్యక్తం చేశాడు. ఈ కీలక మ్యాచ్ లో గెలిస్తే వరల్డ్ కప్ లో మిగతా మ్యాచ్ లకు అవసరమైన ఆత్మవిశ్వాసం లభిస్తుందని పేర్కొన్నాడు. 2011 వరల్డ్ కప్ లో అఫ్రిది నాయకత్వంలోని పాక్ జట్టు సెమీస్ లో భారత్ చేతిలో చిత్తయింది. కాగా, సీనియర్ బ్యాట్స్ మన్ యూనిస్ ఖాన్ కూడా అఫ్రిదితో ఏకీభవించాడు. తొలి మ్యాచే భారత్ తో ఆడనుండడం మంచిదేనని, గెలిస్తే, రెట్టించిన ఉత్సాహంతో టోర్నీలో మిగతా మ్యాచ్ లు ఆడవచ్చని అన్నాడు.