: నాలుగో భర్తపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లి అడ్డంగా దొరికిపోయిన కి'లేడి'!


అలేఖ్యా రెడ్డి (29) అలియాస్ బుజ్జి, అలియాస్ హేమ, అలియాస్ శైలు... పేరు ఏదైతేనేం... తన అందం, తెలివితో డబ్బున్న వారిని బుట్టలో వేసుకొని, వివాహం చేసుకొని, కొన్ని రోజుల తరువాత వారిని బెదిరించి డబ్బుతో చెక్కేయడమే పని. ఈ దఫా మాత్రం ఆమె పప్పులు ఉడకలేదు. దీంతో తాజా భర్తపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లి అడ్డంగా దొరికిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్‌ నగర్‌ లో నివాసముంటున్న అలేఖ్య, తన భర్త, బాబాయ్, ఇతర కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందంటూ డీసీపీని ఆశ్రయించింది. ఆయన ఈ కేసును ఎస్‌ఆర్‌ నగర్ పోలీసులకు సిఫారసు చేయడంతో అలేఖ్య ఎస్‌ఆర్‌ నగర్ పీఎస్‌ కు వచ్చింది. ఫిర్యాదు ఇస్తున్న సమయంలో పోలీసులకు ఎందుకో అనుమానం వచ్చింది. ఈమెపై పలు కేసులు ఉన్నాయన్న అనుమానాలతో, పాత ఫైళ్ళ బూజు దులిపారు. దీంతో ఆమెలో అసలు కోణం బయటపడింది. గతంలో తమకు అందిన ఫిర్యాదుల తాలూకు వ్యక్తేనని నిర్ధారించుకుని తమదైన శైలిలో అలేఖ్యను ప్రశ్నించగా, తన తప్పులు ఒప్పుకుంది. ఉన్నతాధికారిని అని చెప్పుకు తిరుగుతూ, ఇళ్ళు, ఉద్యోగాలు ఇప్పిస్తానని ప్రజల నుంచి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకూ డబ్బులు వసూలు చేసిందట. ఈమె అరెస్టయిన వార్త తెలుసుకుని పెద్ద సంఖ్యలో బాధితులు పోలీస్‌ స్టేషన్‌ కు వచ్చి తామెలా మోసపోయిందీ వెల్లడించి ఫిర్యాదులు ఇస్తున్నారు.

  • Loading...

More Telugu News