: 173 మంది భారతీయ ఖైదీలను విడుదల చేయనున్న పాక్
మొత్తం 526 మంది భారత ఖైదీల్లో 173 ఖైదీలను ఈ నెల 16న పాకిస్థాన్ విడుదల చేయబోతున్నట్టు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వారిలో ఓ సామాన్య పౌరుడు కూడా ఉన్నాడు. ఈ మేరకు పాక్ నుంచి ఓ లేఖ తమకు అందినట్టు ఆ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు. "త్వరలో తిరిగి వస్తారని నిరీక్షిస్తున్నాం. మరో నాలుగు రోజుల్లో నూటడెబ్బై మూడు మంది మన దేశ ఖైదీలను రిలీజ్ చేసి, స్వదేశానికి పంపుతారని సమాచారం అందింది" అని సయ్యద్ ట్వీట్ చేశాడు. విడుదలయిన వారందరూ వాఘా సరిహద్దు ద్వారా వస్తారని, అక్కడ మొదట భారత దౌత్య సిబ్బంది వారిని రిసీవ్ చేసుకుంటారని చెప్పారు. ఈ ఏడాది జనవరిలో దాదాపు 526 మంది భారతీయులను పాక్ బంధించగా, వారిలో 50 మంది సాధారణ పౌరులు కూడా ఉన్నారు.