: సాగర్ కుడికాలువకు నీటివిడుదల ఆపివేయడం బాధాకరం: ప్రత్తిపాటి
ఏపీ అదనంగా 44 టీఎంసీల నీరు వాడుకుందంటూ తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్ కుడికాలువకు నీటి విడుదలను నిలిపివేయడంపై వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. నీటి విడుదలను ఆపివేయడం బాధాకరమన్నారు. ఈ ఉదయం మంత్రిని రైతు సంఘం నేతలు కలసి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చిస్తోందని, సాగు, తాగునీటి కోసం నీరు విడుదల చేయాలని కోరతామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. మొక్కజొన్నకు మద్దతుధర ఇవ్వడం లేదని రైతులు ఫిర్యాదు చేశారు. రైతుమిత్ర, జేఎల్ జీ గ్రూపుల్లోకి రైతుల రుణాలు మాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన ప్రత్తిపాటి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.