: తమిళనాడు కాంగ్రెస్ కూ ఓ కేజ్రీవాల్ కావాలట!
తమిళనాడులో కాంగ్రెస్ పుంజుకోవాలంటే కేజ్రీవాల్ వంటి నాయకుడు అవసరమని ఏఐసీసీ సభ్యుడు కార్తీ చిదంబరం అంటున్నారు. బెదిరింపు ఎత్తుగడలకు లొంగని, దమ్మున్న, నమ్మకస్తుడైన అలాంటి నేత మాత్రమే ఏఐఏడీఎంకే, డీఎంకే పార్టీలను చిత్తు చేయగలడని ఉద్ఘాటించారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఘనవిజయం ద్వారా కాంగ్రెస్ ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా, తమిళనాడు కాంగ్రెస్ తప్పనిసరిగా నేర్చుకోవాలని అన్నారు. ఎవరూ గొప్పవారు కాదని, ఓ రాష్ట్ర ఎన్నికల్లో జాతీయ అజెండా పనిచేయదని కార్తీ వ్యాఖ్యానించారు. రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినంత వరకు స్పష్టమైన అజెండా ఉన్న విశ్వసనీయ వ్యక్తి అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయం చెప్పడానికి తానేమీ ఇగో ఫీలవడంలేదని ఈ తమిళ తంబి స్పష్టం చేశారు.