: ఈ 7 తప్పులతోనే బీజేపీకి ఘోర పరాజయం!
ప్రపంచాన్ని జయించి వచ్చి ఇంట్లో ఓడిపోయినట్టుగా ఉంది ఇప్పుడు బీజేపీ పరిస్థితి. ఢిల్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న ఆ పార్టీ ఓటమికి దారితీసిన కారణాలను వెతికే పనిలో ఫుల్ బిజీగా ఉంది. బీజేపీ ఓటమికి 7 ప్రధాన కారణాలున్నాయని రాజకీయ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. అందులో ప్రధానమైనది ఎన్నికలు జరిపించిన సమయం. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలతో పాటే ఢిల్లీ ఎన్నికలు జరిపి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదట. ఎన్నికల తేదీలు ప్రకటించిన తరువాత అభ్యర్థుల ఎంపికలో ఆలస్యం కావడం, ప్రచారానికి ఆ పార్టీ నేతలు ఆలస్యంగా కదలడం కూడా కొంప ముంచిందట. ఇక ఎన్నికలకు రోజుల ముందు ఆదరాబాదరాగా కిరణ్ బేడీని తీసుకువచ్చి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం కూడా ఆ పార్టీ నేతల్లో కొంత నైరాశ్యాన్ని నింపింది. బీజేపీ ఓటమికి నాలుగో కారణం మైనారిటీలకు దగ్గర కాలేకపోవడంతో పాటు కాంగ్రెస్ వోట్ బ్యాంక్ ను ఆకర్షించడంలో ముందంజ వేయలేక పోయింది. వ్యతిరేక ప్రచారంపై అధికంగా ఆధారపడడం ఐదో కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. బీజేపీ సీనియర్ నేతలైన ఎల్.కే.అద్వాని, విజయ్ కుమార్ మల్హోత్రా తదితరులు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, కేజ్రీవాల్ లపై తీవ్ర విమర్శలకు మాత్రమే పరిమితం అయ్యి, తమ పార్టీ ఏం చేస్తుందో చెప్పడంలో విఫలం అయ్యారు. దీంతో పాటు కేజ్రివాల్ తలను చలి నుంచి కప్పుకోవడానికి మఫ్లర్ కప్పుకు తిరుగుతూ, మధ్య తరగతి ప్రజలను తలపిస్తే, బీజేపీ వారు ఖరీదైన కార్లలో తిరుగుతూ, 5 స్టార్ హోటళ్ళలో సమీక్షలు నిర్వహిస్తూ ఉండడం ఓటర్లలో ఆలోచనలు పెంచింది. ఇక ఆఖరుగా ఎన్నికలకు రెండు రోజుల ముందే ఫలితాలు మోదీ పాలనకు రెఫరెండం కాదని ఆ పార్టీ నేతలు చెప్పడం, ముందే ఓటమిని వారు అంగీకరించిన సంకేతాలను ప్రజల్లోకి పంపింది. దీంతో ఆఖరి నిమిషంలో కొన్ని లక్షల వోట్లు ఆప్ ఖాతాలోకి వెళ్లాయని రాజకీయ పండితులు భావిస్తున్నారు.