: హన్మకొండలో తెలంగాణవాదుల విధ్వంసం... చంద్రబాబు సభా వేదికకు నిప్పు
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తెలంగాణలో తొలి పర్యటనపై తెలంగాణవాదులు భగ్గుమన్నారు. రాష్ట్ర విభజన, ఎన్నికల తర్వాత తెలంగాణ జిల్లాల్లో తొలిసారి అడుగుపెట్టేందుకు చంద్రబాబు నేడు వరంగల్ వెళ్లాల్సి ఉంది. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పార్టీ నేతలు వరంగల్ జిల్లా హన్మకొండలోని హయగ్రీవాచారి కొండ వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. అయితే చంద్రబాబును తెలంగాణకు వ్యతిరేకిగా భావిస్తున్న తెలంగాణ వాదులు ఆయన పర్యటనకు ఆదిలోనే అడ్డు తగిలారు. హయగ్రీవాచారి కొండ వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్ద తెలంగాణవాదులు ధ్వంస రచనకు దిగారు. వేదిక వెనుకభాగానికి నిప్పుపెట్టారు. దీంతో సభావేదిక పాక్షికంగా కాలిపోయింది. నేటి ఉదయం హైదరాబాదు నుంచి పార్టీ కార్యకర్తలతో కలిసి చంద్రబాబు ర్యాలీగా బయలుదేరనున్నారు. తాజా ఘటనలో చంద్రబాబు పర్యటన ఉద్రిక్తతలు రేకెత్తించడం ఖాయమని పోలీసులు భావిస్తున్నారు.