: తడబడి, కింద పడి...27 మందిపై సస్పెన్షన్ వేటు వేసిన అధ్యక్షుల వారు!
జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే తీరుపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశానికి ఆయన చేరుకున్నారు. హరారేలోని అంతర్జాతీయ విమానాశ్రయంలోకి ఆయన చేరుకునే సరికి మంత్రులు, అధికారులు రెడ్ కార్పెట్ తో స్వాగతం పలికారు. పక్కనే ఉన్న వేదిక నుంచి తన పర్యటన వివరాలు వెల్లడించిన ముగాబే, తన కాన్వాయ్ వద్దకు చేరుకునేందుకు అడుగులేశారు. 90 ఏళ్ల ముగాబే అడుగులు తడబడి తనకు తానే కిందపడ్డారు. దీంతో అప్రమత్తమైన భద్రతాసిబ్బంది ఆయనను పైకి లేపారు. దీంతో ఆయన కోపం తారస్థాయికి చేరింది. కాసేపటికే విధుల్లో ఉన్న మొత్తం 27 మంది రక్షణ సిబ్బందిపై వేటువేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయనను క్రేన్ తో లేపాలా? అన్నట్టు ఓ విమర్శ రాగా, ముగాబే పడిపోతున్న పోజును ఎగిరినట్టు ఫోటో షాప్ లో క్రియేట్ చేసిన నెటిజన్ అతనితో పాటు భద్రతాధికారులు కూడా ఎగురుతున్నట్టు చూపించాడు. అలాగే పరుగు పందేనికి సిద్ధమవుతున్నట్టు కూడా ఫోటో షాప్ లో చేసి తమ హాస్యచతురత చూపారు.