: రిజర్వ్ బ్యాంక్ అంగీకరించకపోయినా రుణమాఫీ చేశాం: చంద్రబాబు
విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రసంగించారు. రైతు రుణమాఫీకి కేంద్రం తోడ్పాటు అందించలేదని, రిజర్వ్ బ్యాంకు కూడా అంగీకరించలేదని తెలిపారు. అయినా, తాము ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ చేశామని అన్నారు. రైతులకు న్యాయం జరగాలన్నదే తమ ఆకాంక్ష అని స్పష్టం చేశారు. డ్వాక్రా సంఘాల రుణాలు కూడా మాఫీ చేస్తామని చెప్పారు. ఇక, మరుగుదొడ్ల ప్రాముఖ్యతను వివరించారు. కుటుంబంలో అందరికీ సెల్ ఫోన్లు ఉన్న ఈ రోజుల్లో ఇంటికి ఓ మరుగుదొడ్డి లేకపోవడం బాధాకరమని అన్నారు. వంద రోజుల్లో లక్ష మరుగుదొడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. జూన్ నాటికి అన్ని స్కూళ్లలో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. స్థానిక జీవీఆర్ కాలేజీలో జరిగిన ఈ సభలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు కూడా పాల్గొన్నారు. సభలో పాల్గొనక ముందు సీఎం చంద్రబాబు స్థానిక కనకమహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.