: సీనియర్ ఎన్టీఆర్ పై రాంగోపాల్ వర్మ తీవ్ర వ్యాఖ్యలు
వివాదాలకు మారుపేరైన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈసారి సీనియర్ ఎన్టీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ తో పోలిస్తే సీనియర్ ఎన్టీఆర్ పెద్ద జీరో అని వ్యాఖ్యానించాడు. ఐదు దశాబ్దాలుగా పెద్ద ఎన్టీఆర్ ను అభిమానిస్తున్నానని, 'టెంపర్' సినిమా చూశాక తన అభిప్రాయం మారిపోయిందని తెలిపాడు. ఎన్టీఆర్... జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు. సీనియర్ ఎన్టీఆర్ నటించిన 'అడవి రాముడు' చిత్రాన్ని 17 సార్లు చూశానని, జూనియర్ నటించిన 'టెంపర్' ను 27 సార్లు చూడాలనిపిస్తోందని పేర్కొన్నాడు. అంతేగాకుండా, ఆత్మలను కూడా వ్యవహారంలోకి లాగాడు వర్మ. తాను ఫిబ్రవరి 13న 'టెంపర్' సినిమా చూసేందుకు భ్రమరాంబ థియేటర్ కు వెళుతున్నానని, ఆత్మలున్నాయన్న విషయం నిజమే అయితే, సీనియర్ ఎన్టీఆర్ ఆత్మ కూడా ఆ సినిమా చూసేందుకు రావాలని అన్నాడు. అలా రాకుంటే, సీనియర్ ఎన్టీఆర్ ఆత్మ జూనియర్ నటన పట్ల జెలసీ ఫీలవుతున్నట్టేనని సూత్రీకరించాడు. ఇక, తాను సీనియర్ ఎన్టీఆర్ కు పెద్ద అభిమానినని, 'టెంపర్' లో జూనియర్ నటన చూసిన తర్వాత ఉద్వేగంలో అలా అభిప్రాయాలు వెల్లడించానని ముక్తాయించాడు.