: ఇకనైనా ప్రియాంక రంగంలోకి దిగాలి... డిమాండ్ చేస్తున్న కార్యకర్తలు
ఢిల్లీ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ కు దిమ్మతిరిగిపోయింది. ఆప్ వీరవిహారం చేయడంతో కాంగ్రెస్ బిక్కచచ్చిపోయింది. కనీసం ఒక్క స్థానంలోనూ ఆధిక్యం కనబర్చలేక మద్దతుదారులను ఉసూరుమనిపించింది. దీంతో, ప్రియాంక వాద్రాను రంగంలోకి దింపాలన్న డిమాండ్లు మరోసారి ఊపందుకున్నాయి. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం ఎదుట మంగళవారం కాంగ్రెస్ కార్యకర్తలు 'బ్రింగ్ ప్రియాంక' అంటూ నినాదాలు చేశారు. ప్రియాంక రాజకీయాల్లో ప్రవేశించాలని వారు కోరారు. 'ప్రియాంక లావో కాంగ్రెస్ బచావో' (ప్రియాంకను తీసుకురండి, కాంగ్రెస్ ను కాపాడండి) అంటూ బ్యానర్లు ప్రదర్శించారు. కాగా, ఇలాంటి డిమాండ్లు రావడం ఇదే తొలిసారి కాదు. లోక్ సభ ఎన్నికలు, హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పాలైన అనంతరం కూడా వినిపించాయి.