: ఏఐసీసీ జనరల్ సెక్రటరీ పదవికి అజయ్ మాకెన్ రాజీనామా ... ఆప్ ఎఫెక్ట్
ఢిల్లీ కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఫలితాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు సీనియర్ నేత అజయ్ మాకెన్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ మాకెన్ ను ఢిల్లీ సీఎం అభ్యర్థిగా బరిలో నిలిపింది. అయితే, ఆమ్ ఆద్మీ పార్టీపై వెల్లువెత్తిన ప్రజాభిమానం ముందు కాంగ్రెస్ నామరూపాల్లేకుండా పోయినట్టు ఓట్ల లెక్కింపు సరళి తేటతెల్లం చేస్తోంది. మాకెన్ ఢిల్లీ ఎన్నికల్లో సదర్ బజార్ నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. కనీసం ఆధిక్యంలో ఉన్నట్టు కూడా కనిపించకపోవడంతో మాకెన్ ఓటమి లాంఛనమేనని అర్థమవుతోంది! ఈ నేపథ్యంలో మాకెన్ మాట్లాడుతూ, ఆప్ కు అభినందనలు తెలిపారు. ప్రజల తీర్పును గౌరవిస్తామని అన్నారు. హామీలను కేజ్రీవాల్ నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.