: కృష్ణానగర్ లో వెనుకబడ్డ కిరణ్ బేడీ... శర్మిష్ఠ ముఖర్జీదీ అదే బాట!
ఢిల్లీ అసెంబ్లీ ఓట్ల లెక్కింపులో బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ వెనుకబడ్డారు. కృష్ణానగర్ నుంచి బరిలోకి దిగిన కిరణ్ బేడీ... తొలుత ఆధిక్యం సాధించినా, ఆ తర్వాత వెనుకబడ్డారు. బేడీపై పోటీ చేసిన ఆప్ అభ్యర్థి ఎస్కే బగ్గా ఆధిక్యం సాధించారు. ఇక బీజేపీ టికెట్ల పై పోటీ చేసిన ఆ పార్టీ ప్రముఖులు కూడా వెనకబడ్డారు. పార్టీ నేతలు జగదీశ్ ముఖి, కృష్ణా తీరథ్, ఆప్ నుంచి బీజేపీలో చేరిన వినోద్ బిన్నీ తదితరుల ఆధిక్యం క్షణాల్లో కనుమరుగైపోయింది. ఇదిలా ఉంటే గ్రేటర్ కైలాష్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన రాష్ట్రపతి తనయ శర్మిష్ఠ ముఖర్జీ(కాంగ్రెస్) కూడా ఓటమి దిశగా సాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి అజయ్ మాకెన్ కూడా వెనుకంజలో ఉన్నారు. మరోవైపు ఆప్ అభ్యర్థులు ఆధిక్యం సాధించిన సీట్ల సంఖ్య 56కు పెరిగింది.