: కలెక్టర్ కార్యాలయంలో దంపతుల ఆత్మహత్యాయత్నం
మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ లో దంపతులు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. దీంతో అక్కడున్నవారు, పోలీసులు కల్పించుకుని వారిని సముదాయించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి సందర్భంగా కలెక్టరుకు తమ సమస్యలు వివరించేందుకు వనపర్తి మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన శ్రీరాములు, శ్రీలక్ష్మి దంపతులు వచ్చారు. ఏడేళ్ల క్రితం ప్రభుత్వం వీరికి 100 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించింది. దీనిని కబ్జాదారులు కొంత మంది ఆక్రమించారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ వారు ప్రజావాణిలో 7 సార్లు ఫిర్యాదు చేశారు. అధికారులు వారి అర్జీని బుట్టదాఖలు చేయడంతో, తమకు నీడ లేకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆవేదనతో ఆ దంపతులు తమతో తెచ్చుకున్న కిరోసిన్ ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో స్పందించిన పలువురు అడ్డుకోగా, పోలీసులు వచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు.