: ‘నల్ల ఖాతా’ల కంపెనీలపై సెబీ ఉక్కుపాదం... ట్రేడింగ్ నుంచి నిషేధానికి చర్యలు షురూ!
అక్రమార్జనను విదేశాలకు తరలించి, దేశానికి పన్ను ఎగవేసిన దేశీయ కంపెనీలపై ఓ వైపు కేంద్రం దర్యాప్తు ముమ్మరం చేస్తుంటే, మరోవైపు సెబీ కూడా సదరు కంపెనీలపై చర్యలకు సన్నాహాలు చేస్తోంది. స్విస్ బ్యాంకుల్లో ‘నల్ల ఖాతా’లు కలిగిన లిస్టెడ్ కంపెనీలను ట్రేడింగ్ నుంచి బహిష్కరించేందుకు సెబీ చర్యలను ప్రారంభించింది. ఇప్పటికే సదరు ఖాతాలు కలిగిన కంపెనీలను సెబీ గుర్తించింది. కేవలం నల్ల ధనాన్ని తరలించేందుకే పుట్టుకొచ్చిన కంపెనీలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన సెబీ... సదరు కార్యకలాపాల్లో లిస్టెడ్ కంపెనీలు, బడా పారిశ్రామికవేత్తల ప్రమేయం కూడా ఉన్నట్టు అనుమానిస్తోంది. ఈ తరహా కార్యకలాపాల్లో పాలుపంచుకున్నట్టు తేలితే, సదరు కంపెనీల ట్రేడింగ్ ను నిలిపివేయాలని ఇప్పటికే తీర్మానించిన సెబీ, ఆ దిశగా చర్యలను ముమ్మరం చేసిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.