: విశ్వాస పరీక్షలో ఓడితే తప్పుకుంటా: బీహార్ ముఖ్యమంత్రి మాంఝీ
బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేది లేదని జతిన్ రామ్ మాంఝీ స్పష్టం చేశారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, బీహార్ లో ఏర్పడిన రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించాలని కోరారు. అసెంబ్లీలో తనకు పూర్తి బలముందని పేర్కొన్న ఆయన, విశ్వాస పరీక్షలో ఓడితే తప్పుకుంటానని స్పష్టం చేశారు. అయితే మహా దళితులను నితీష్ కుమార్ అవమానించారని ఆయన పేర్కొన్నారు. రబ్బరు స్టాంపుగా మారలేనని, అది తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందని ఆయన పేర్కొన్నారు. విశ్వాసపరీక్షలో మద్దతిస్తామని మోదీ తెలిపారని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 20 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. కాగా, అసెంబ్లీని రద్దు చేయాలని విజ్ఞప్తి చేయడానికి రేపు 1:30 నిమిషాలకు మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గవర్నర్ ను కలవనున్నారు.