: ఢిల్లీ నుంచి గల్లీ వరకు, ప్రధాని నుంచి పంచాయతీ వరకు అధికారమిచ్చాం, ఏం చేశారు?: వెంకయ్యనాయుడు


ఢిల్లీ నుంచి గల్లీ వరకు, ప్రధాని నుంచి పంచాయతీ వరకు దేశ ప్రజలు కాంగ్రెస్ కు అధికారం ఇస్తే ఏం చేశారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఆయన మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన ఆర్డినెన్స్ తేవడానికి కూడా కాంగ్రెస్ ప్రయత్నించలేదని గుర్తు చేశారు. అలాంటి కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మైకులు పగిలేలాగా ప్రసంగాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తాము ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని ఆయన స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల అవసరాలు ఏంటో తమకు తెలుసన్న ఆయన, ప్రతి అవసరాన్ని తీరుస్తామని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు నిధులు మంజూరు చేశాం, చేస్తూనే ఉంటామని ఆయన వెల్లడించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ నేతలు రాజకీయ ఉనికి కోసం ఆరోపణలు చేస్తున్నారని, చేస్తూనే ఉంటారని, వారిని ప్రజలు మాత్రం పట్టించుకోరని ఆయన తెలిపారు. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తుందని తెలిపిన ఆయన, అంచనాలు తారుమారైనా అది కేంద్రం పనితీరుకు నిదర్శనం కాదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News