: వ్యూహాల్లో తలమునకలు...బీహార్ రాజకీయ సంక్షోభం
బీహార్ లో రాజకీయ సంక్షోభం నెలకొంది. అధికార జేడీయూలో ఆధిపత్య పోరు బీహార్ లో రాజకీయ సంక్షోభానికి తెరలేపింది. జేడీయూకు చెందిన 97 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీ శాసనసభాధ్యక్షుడిగా మాజీ సీఎం నితీష్ కుమార్ ను ఎన్నుకున్నారు. దీంతో ప్రస్తుత సీఎం జతిన్ కుమార్ మాంఝీ పదవీత్యాగం చేయాల్సి ఉండగా, ఆయన అందుకు తిరస్కరించారు. దీనికి తోడు ఆయన అసెంబ్లీని రద్దుచేయాలని గవర్నర్ కు సిఫారసు చేయనున్నట్టు తెలుస్తోంది. తన మంత్రి వర్గ సహచరులను మార్చాలని ఆయన గవర్నర్ కు సిఫారసు చేశారు. దీంతో ఆయన వ్యూహాత్మకంగా ఈ అడుగు వేశారని పరిశీలకులు భావిస్తున్నారు. మంత్రి వర్గాన్ని రద్దు చేస్తే, ఆయన బలపరీక్షలో నిలబడాల్సి రావచ్చు. దీంతో ఆయన రానున్న అసెంబ్లీ సమావేశాల్లో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అదే జరిగితే ఆయన బీజేపీ సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు. బీహార్ లో బీజేపీకి 87 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. విశ్వాసపరీక్షలో మాంఝీ ప్రభుత్వం గట్టెక్కాలంటే కనీసం 117 మంది ఎమ్మెల్యేలు కావాలి. బీజేపీ మద్దతిస్తే సొంత పార్టీ నేతల్లో కొంత మందిని ఆకట్టుకున్నా సరిపోతుంది. ఈ నేపధ్యంలో మాంఝీ ప్రధాని నరేంద్ర మోదీని నేటి సాయంత్రం కలవనున్నారు. ఈ భేటీలో మద్దతుపై చర్చ జరిగే అవకాశం ఉంది. మాంఝీకి బీజేపీ మద్దతిస్తే బీహార్ లో బలం పుంజుకోవాలని భావిస్తున్న ఆ పార్టీకి భవిష్యత్ లో మంచిరోజులు వచ్చినట్టే. మొత్తానికి బీహార్ రాజకీయ సంక్షోభం జేడీయూకి ప్రాణసంకటంలా పరిణమిస్తే, బీజేపీకి మాత్రం లబ్ధి చేకూర్చేలా కనిపిస్తున్నాయి.