: పెళ్లి ఏర్పాట్లు ఘనంగా లేవని...వరుడి ఆత్మహత్య
వివాహం ఘనంగా జరుగుతుందని స్నేహితుల ముందు గర్వంగా కాలరెత్తుకుని తిరిగొచ్చని ఊహించాడు. ఊహించినట్టు జరగకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడి రెండు కుటుంబాలకు శోకం మిగిల్చిన ఘటన గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేములాయపాడు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... వరుడు ఏసుబాబు తన అక్క కూతురిని వివాహం చేసుకునేందుకు పెద్దలు నిశ్చయించారు. మేనకోడలినే వివాహం చేస్తున్నారు కనుక ఘనంగా పెళ్లి జరుగుతుందని ఏసుబాబు భావించాడు. నేటి సాయంత్రం ఐదు గంటలకు ఏసుబాబు తన మేనకోడలిని వివాహం చేసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో పెళ్లి ఏర్పాట్లు సాధారణంగా ఉండటంతో ఏసుబాబు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తను కోరుకున్నట్లుగా వైభవంగా కాకుండా సాధారణ రీతిలో వివాహ ఏర్పాట్లు ఉన్నాయని ఈ ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరికొద్దిసేపట్లో శుభకార్యం ఉండగా, వరుడు ఆత్మహత్యకు పాల్పడడంతో రెండు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. కొత్త జీవితానికి అక్షింతలు వేసి ఆశీర్వదిద్దామని వచ్చిన బంధువులు, దారుణంపట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.