: నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం సిద్ధంగా లేదట... ఏపీ, టీఎస్ లకు నిరాశే!
ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత ఏపీ, తెలంగాణల్లో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందంటూ అందరూ భావించారు. దీనికి తగ్గట్టుగానే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కార్యాచరణ మొదలుపెట్టాలనుకున్నాయి. అయితే, కొత్త నియోజకవర్గాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఉందన్న వార్త తాజాగా బయటపడింది. వివరాల్లోకి వెళ్తే, టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఛీఫ్ ఎలక్షన్ కమిషనర్ బ్రహ్మను కలిశారు. ఈ సందర్భంగా కేంద్రం నుంచి ఒక లేఖ వచ్చిందని, 2026 వరకు కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు చేయరాదనే విషయం అందులో క్లియర్ గా ఉందని కేసీఆర్ కు బ్రహ్మ తెలిపారు. దీనికి సంబంధించి, కేంద్ర ప్రభుత్వంతోనే డైరెక్ట్ గా మాట్లాడాలని ముఖ్యమంత్రికి బ్రహ్మ సూచించారు. ఇదంతా గమనిస్తే, నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం సుముఖంగా లేదనే విషయం అర్థమవుతోంది.