: చంద్రబాబుతో రక్షణ మంత్రి భేటీ... అజెండా ఏమీ లేదంటున్న ప్రభుత్వ వర్గాలు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ శనివారం ఉదయం హైదరాబాదులో భేటీ అయ్యారు. అయితే, వీరి భేటీకి ప్రత్యేక అజెండా ఏమీ లేదని సర్కారు వర్గాలు అంటున్నాయి. కేంద్ర మంత్రి ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాదు వచ్చారని, అందుకనే, మర్యాదపూర్వకంగా బాబును కలిశారని ఆ వర్గాలు వివరించాయి. ఈ భేటీలో సుజనా చౌదరి, కంభంపాటి రామ్మోహన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబు... రాష్ట్రానికి వీలైనన్ని రక్షణ రంగ ప్రాజెక్టులు కేటాయించాలని కోరారు. డిఫెన్స్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అంతేగాకుండా, కేంద్రం ప్రకటించిన ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ విషయాన్ని కూడా కేంద్ర మంత్రికి చంద్రబాబు గుర్తు చేశారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, మరింత సాయం దక్కేందుకు సహకరించాలని కోరారు.