: సీబీఐ, కాగ్, సీవీసీల నిర్ణయాలతో భయమేస్తోంది: అనిల్ అంబానీ
ప్రభుత్వ విచారణ సంస్థలు సీబీఐ, సీవీసీ, కాగ్ లు ఆలస్యంగా తీసుకునే నిర్ణయాల వల్ల కొంత భయమేస్తోందని ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ పేర్కొన్నారు. ఏదైనా స్కాంలో సత్వర నిర్ణయాలు తీసుకుంటే అందరూ దాని గురించే మాట్లాడుకుంటారని, దానివల్ల అవినీతి పరులను పరిశోధన, విజిలెన్స్, ఆడిట్ సంస్థల దర్యాప్తు పరిధిలోకి తీసుకురావచ్చని ఈ రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అన్నారు. అయితే, లాభాపేక్షలేని పారదర్శక వ్యవస్థను తీసుకురావాలని తాను కోరడం లేదని అనిల్ ప్రభుత్వ అధికారులకు స్పష్టం చేశారు. ఇటీవల కేంద్రం బొగ్గు క్షేత్రాల ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని ఆయన ప్రశంసించారు. మహారాష్ట్రలో ఓ పెద్ద పెట్టుబడిదారుగా చాలా అడ్డంకులు ఎదుర్కొన్నామని, సత్వర నిర్ణయం తీసుకునే అంశం మెరుగవ్వాల్సి ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, వ్యాపారవేత్తలు, బ్యాంకర్లు పలువురితో జరిగిన ఇంటరాక్షన్ కార్యక్రమంలో అనిల్ పేర్కొన్నారు.