: 1.33 కోట్ల మంది చేతుల్లో 673 మంది భవిష్యత్తు!
హోరాహోరీ ప్రచారం, నేతల మాటల యుద్ధం తరువాత ఢిల్లీ ఓటరు మరికాసేపట్లో తనదైన వజ్రాయుధం ‘ఓటు’తో ముందుకు కదలనున్నాడు! ఎన్నికల బరిలో నిలిచిన 673 మంది భవితవ్యాన్ని 1.33 కోట్ల మంది ఓటర్లు నిర్ణయించే పోలింగ్ క్రతువు మరికాసేపట్లో ఆరంభం కానుంది. ఈ ఎన్నికల్లో అంతిమంగా విజేతలుగా నిలిచేది 70 మంది మాత్రమే. కాగా, ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఇందుకోసం మొత్తం 12,177 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బీజేపీ, ఆప్ మధ్య నువ్వా? నేనా? అన్నట్టుగా సాగుతున్న ఈ ఎన్నికల పోరులో ఏ పార్టీకి అధిక సీట్లు వస్తాయన్న అంచనాలు సైతం స్పష్టంగా వెల్లడికాలేదు. ఎన్నికలపై సర్వేలు నిర్వహించిన వివిధ టీవీ చానళ్లు, సంస్థలు రోజుకో మాట చెప్పడంతో ఎన్నికల వాతావరణం మరింతగా వేడెక్కింది. నేటి ఓటింగ్ లో పోలింగ్ శాతమే కీలకం కాగలదని నిపుణులు చెబుతున్నారు. ఈ నెల 10న ఓట్ల లెక్కింపు చేపడతారు.