: మెల్ బోర్న్, క్రైస్ట్ చర్చ్ లలో వరల్డ్ కప్ ప్రారంభ వేడుకలకు సన్నాహాలు
ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్, న్యూజిలాండ్ లోని క్రైస్ట్ చర్చ్ వేదికలుగా వన్డే క్రికెట్ ప్రపంచకప్ ప్రారంభ వేడుకలు జరుగనున్నాయి. వచ్చే గురువారం సాయంత్రం 6:30 నుంచి 10:00 గంటల వరకు జరగనున్నాయని ఐసీసీ ప్రకటించింది. ఈ ప్రారంభ కార్యక్రమంలో అబ్బురపరిచే బాణసంచా వెలుగులకు తోడు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కళాకారుల సంగీత, సాంస్కృతిక ప్రదర్శనలు కనువిందు చేయనున్నాయని ఐసీసీ పేర్కొంది. న్యూజిలాండ్ లోని క్రైస్ట్ చర్చ్ లో జరిగే ప్రారంభ వేడుకకు దిగ్గజాలైన మాజీ క్రికెటర్లు రిచర్డ్ హాడ్లీ, స్టీఫెన్ ఫ్లెమింగ్ తోపాటు న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ మెక్ కల్లమ్ తదితరులు హాజరుకానుండగా, మెల్ బోర్న్ లో జరగనున్న ప్రారంభ వేడుకల్లో ఇప్పటి వరకు జరిగిన ప్రపంచకప్ లలో ఆడిన ఆటగాళ్లు పాలుపంచుకోనున్నారు. కాగా, వరల్డ్ కప్ ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.