: అంజలిపై కేసుల వాపస్ కు పిన్ని రెడీ
దక్షిణాది హీరోయిన్ అంజలిపై హైకోర్టులో దాఖలు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని ఆమె పిన్ని భారతీదేవి నిర్ణయించింది. అంజలి ఈ నెల 8న అదృశ్యం అవడంతో ఆమె పిన్ని చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, తన పిన్ని,బాబాయి పెట్టే బాధలు భరించలేకే వెళ్ళిపోతున్నట్టు అంజలి మీడియాతో పేర్కొంది. తదనంతర పరిణామాల నేపథ్యంలో పిన్ని భారతీదేవి తన దత్త కుమార్తె అంజలిని ఎవరో కిడ్నాప్ చేశారంటూ కేసు పెట్టారు కూడా. తనపై అంజలి చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. ఆమెను కన్నబిడ్డకంటే ఎక్కువగా చూసుకున్నానని వివరించారు.
కాగా, అంజలి అదృశ్యంపై మద్రాసు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలవడంతో ఇప్పుడది విచారణకు రానుంది. ఆ విచారణకు అంజలి హాజరుకావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆమె షూటింగ్ లతో బిజీగా ఉంది. అందుకే అంజలి షూటింగ్ లకు ఆటంకం కలగకూడదన్న ఉద్ధేశంతో ఆమె పిన్ని భారతీదేవి కేసులను వాపస్ తీసుకోవాలని భావిస్తోంది.