: టెన్షన్ వద్దు... సహజసిద్ధంగా ఆడితే చాలు: పాక్ జట్టుతో పోరుపై అజ్జూభాయ్ సలహా
వరల్డ్ కప్ అంటేనే ఆటగాళ్లపై ఒత్తిడి ఉంటుంది. అలాంటి టోర్నీలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఆ ఒత్తిడి పదింతలు అవుతుంది. టీమిండియాకు ఎన్నో విజయాలు అందించిన మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ విలువైన సలహా ఇచ్చాడు. వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు టీమిండియాపై పాక్ విజయం సాధించిన దాఖలాలు లేవు కనుక భారత ఆటగాళ్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నాడు. సహజసిద్ధంగా ఆడితే విజయం సాధించడం పెద్ద విషయమేమీ కాదని పేర్కొన్నాడు. దీనికోసం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదని ఆయన అభిప్రాయపడ్డాడు. పాక్ తో మ్యాచ్ ను అంత సీరియస్ గా పరిగణించాల్సిన పనిలేదని అజ్జూభాయ్ తెలిపాడు. ఫిబ్రవరి 15న అడిలైడ్ లో ఈ మ్యాచ్ జరగనుండగా, టికెట్లు ఇప్పటికే అమ్ముడుపోయాయి. ప్రపంచకప్ లో ప్రసార సాధనాల ద్వారా అత్యధికులు వీక్షించే మ్యాచ్ ఇదే అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.