: ఇంటర్నెట్ వ్యసనం వదిలించుకునేందుకు చెయ్యి నరుక్కున్నాడు!
నెట్ కు బానిసలుగా మారిన భారతీయ యువతకు హెచ్చరిక వంటి సంఘటన చైనాలో చోటుచేసుకుంది. తాజాగా ప్రపంచాన్ని భయపెడుతున్న వ్యసనం ఇంటర్నెట్ వినియోగం. ఇంటర్నెట్ కు బానిసలుగా మారితే విలువైన సమయం కోల్పోవడంతో పాటు, ధన నష్టం, అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనాలో నెట్ వాడకం అంటువ్యాధిలా వ్యాపించింది. 2.4 కోట్ల మంది ప్రజలు ఇంటర్ నెట్ కు బానిసలయ్యారని ఓ అధ్యయనం పేర్కొంది. ఈ నేపథ్యంలో నెట్ కు బానిసగా మారిన వాంగ్ అనే 19 ఏళ్ల యువకుడు, దానిని ఎలా వదిలించుకోవాలో తెలియక తన చేతిని నరుక్కున్నాడు. చేతికి సమస్యలు వస్తే నెట్ వినియోగానికి చెక్ చెప్పవచ్చని భావించిన వాంగ్ కూరగాయలు కోసే కత్తితో ఎడమ చేతిని నరుక్కున్నాడు. కిందపడిన చేతిని పట్టుకుని ఆసుపత్రికి వెళ్లి, తన చేతిని అతకమని వైద్యులను కోరాడు. తెగిపడిన అతని చేతిని వైద్యులు ఎలాగోలా అతికించారు. ఇంటర్నెట్ వ్యసనం నుంచి బయటపడేసేందుకు క్లినిక్ లు ఏర్పాటు చేసినా ఫలితం అంతతమాత్రంగా ఉందని సర్వేలు పేర్కొంటున్నాయి.