: ఎంఐఎం మాజీ ఎమ్మెల్యే అఫ్సర్ ఖాన్ మృతి
ఎంఐఎం సీనియర్ నేత, కార్వాన్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ముఖ్తదా అఫ్సర్ ఖాన్ (61) నేటి ఉదయం జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో మృతి చెందారు. ఛాతీ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన రెండు వారాలుగా చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. పరిస్థితి విషమించి పలు అవయవాలు పనిచేయక ఆయన చనిపోయారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఎంఐఎంలో కీలక నేతగా ఉన్న అఫ్సర్ ఖాన్ ఆ పార్టీ ముఖ్యనేత అక్బరుద్దీన్ ఒవైసీకి సన్నిహితుడు. తన సంచలన వ్యాఖ్యలతో పలుమార్లు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. బంగ్లాదేశ్ కు చెందిన వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ మెడలో చెప్పుల దండ వేసేందుకు యత్నించి ప్రపంచస్థాయిలో మీడియా దృష్టిని ఆకర్షించారు. జీహెచ్‌ఎంసీ అబిడ్స్ కార్యాలయం ముందు జరిగిన అల్లర్లలో తుపాకితో గాల్లోకి కాల్పులు జరిపి పోలీసు కేసులను ఎదుర్కున్నారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. అఫ్సర్ ఖాన్ మృతిపట్ల పలువురు రాజకీయ నేతలు తమ సంతాపాన్ని తెలిపారు. పాతబస్తీ నుంచి వందల సంఖ్యలో ఆయన అభిమానులు అపోలో ఆసుపత్రికి తరలి వస్తుండటంతో పోలీసు బందోబస్తును పెంచారు.