: అగ్రిగోల్డ్ పై సెబీ కొరడా... నిధుల సమీకరణ నుంచి బహిష్కరణ
స్వల్ప కాలంలో అధిక రాబడులిస్తామని జనం నెత్తిన కుచ్చుటోపీ పెట్టిన అగ్రిగోల్డ్ సంస్థపై తాజాగా సెబీ కొరడా ఝుళిపించింది. ఇకపై ఎలాంటి డిపాజిట్లను సేకరించరాదని ఆ సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. అగ్రిగోల్డ్ పార్మ్స్ ఎస్టేట్స్ ఇండియా, దాని డైరెక్టర్ల బోర్డులోని ఏడుగురు సభ్యులపై నిషేధం విధిస్తూ సెబీ ఉత్తర్వులు జారీ చేసింది. జనం నుంచి భారీ ఎత్తున డిపాజిట్లు సేకరించిన అగ్రిగోల్డ్, మెచ్యూరిటీ తీరిన బాండ్లకు డబ్బులు చెల్లించడంలో విఫలమైంది. డిపాజిటర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో సంస్థ కార్యాలయాలు, యాజమాన్యానికి చెందిన ఇళ్లల్లో సోదాలు చేసిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇటీవలే ఆదాయపన్ను శాఖ కూడా అగ్రిగోల్డ్ పై సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.