: ఏఐబీ రోస్ట్ వివాదం... దీపికా, సోనాక్షి, రణవీర్, అర్జున్ లపై కేసు నమోదు
అసభ్యత పాళ్లు ఎక్కువయ్యాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఐబీ రోస్ట్ కార్యక్రమంలో పాలుపంచుకున్న బాలీవుడ్ ప్రముఖ నటీనటులపై పుణే పోలీసులు కేసులు నమోదు చేశారు. బాలీవుడ్ యువ హీరోలు రణవీర్ సింగ్, అర్జున్ కపూర్, హీరోయిన్లు దీపికా పదుకొనే, సోనాక్షి సిన్హా, దర్శకుడు కరణ్ జోహార్ సహా 14 మందిపై ఈ కేసులు నమోదయ్యాయి. ఏఐబీ రోస్ట్ కార్యక్రమంలో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో బాలీవుడ్ నటులు అభ్యంతరకర రీతిలో వ్యవహరించారని పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఈ కేసుల్లో మోపిన అభియోగాలు వాస్తవమని తేలితే నిందితులు 5-10 ఏళ్ల దాకా జైలు శిక్షతో పాటు రూ.2 లక్షల దాకా జరిమానాకు గురయ్యే అవకాశాలున్నాయి. పుణే పోలీసుల కేసు నమోదు, మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబై పోలీసుల దర్యాప్తు నేపథ్యంలో కార్యక్రమ నిర్వాహకులు ఏఐబీ రోస్ట్ కు సంబంధించిన వీడియోలను యూట్యూబ్ నుంచి తొలగించారు. జనవరి 28న యూట్యూబ్ లో చేరిన ఈ వీడియో హల్ చల్ చేసింది. ఇదిలా ఉంటే, అసభ్యకరమైన సన్నివేశాలున్న వీడియోలను నెటిజన్లకు అందించిన యూట్యూబ్ పైనా పుణే పోలీసులు కేసు నమోదు చేశారు.