: కుష్బూ భారతమాతగా ఫెక్ల్సీ ఏర్పాటు... కాంగ్రెస్ నేతలపై బీజేపీ ఆగ్రహం
ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా భారీ ఫెక్ల్సీలతో తమకు ఇష్టమైన వ్యక్తులపై అభిమానం కురిపించడం సాధారణమైపోయింది. అంతేనా... ఎవరో ఒకరితో పోలుస్తూ ఫ్లెక్సీలను వేయించడం వివాదాస్పదమవుతోంది. తాజాగా నటి, కాంగ్రెస్ నేత కుష్బూకు ఆ పార్టీ నేతలు ఫ్లెక్సీ పెట్టారు. అందులో ఏముందనేగా సందేహం... మధురైలోని ఓ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో భారతమాత ఫొటోలోని ముఖంలో కుష్బూ ముఖాన్ని ఉంచారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆమెపై ఉన్న అభిమానంతో కాంగ్రెస్ నేతలు ఇలా అత్యుత్సాహం ప్రదర్శించారు. మొదట్లో ఎవరూ అసలు విషయాన్ని గుర్తించలేదట. తరువాత అక్కడివారు తీక్షణంగా పరిశీలించడంతో ఫొటోలో ఉన్నది కుష్బూ ముఖం అని తెలిసింది. వెంటనే బీజేపీ నేతలకు విషయం తెలియడంతో కాంగ్రెస్ తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఫ్లెక్సీని పెట్టి ఇన్ని రోజులైనా స్పందించలేదని, తొలగించాల్సిందేనంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చేసేదిలేక పోలీసులు ఫ్లెక్సీని తొలగించి, అందులోని పేర్ల ఆధారంగా దానిని ఏర్పాటు చేసిన వారిపై కేసులు నమోదు చేశారట.