: బీజేపీని కడిగేసిన రాహుల్ గాంధీ
ఢిల్లీ ఎన్నిల ప్రచారంలో బీజేపీపై కాంగ్రెస్ విమర్శలను తీవ్రం చేసింది. రాహుల్ గాంధీ ఢిల్లీలోని జహంగీర్ పూర్ ప్రచారంలో విమర్శల పదునుపెంచారు. కాంగ్రెస్ అవినీతిమయమైందని, నేరచరిత్ర ఉన్నవారు రాజకీయాల్లో ఉండకూడదని నీతులు వల్లించే బీజేపీ, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 20 మంది నేరచరితులకు సీట్లిచ్చిందని ఆయన విమర్శించారు. 'మేకిన్ ఇండియా' అంటూ నినదించే మోదీ, పది లక్షలు చెల్లించి, విదేశాల్లో సూటు కుట్టించుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ధరలు తగ్గిస్తామన్నారని, నిరుద్యోగులకు ఉద్యోగాలు అన్నారని... ఇప్పుడు వాటి ప్రస్తావనే లేదని, ఏదన్నా అడిగితే విదేశాలకు వెళ్లి మాటలగారడీ చేస్తున్నారని ఆయన విమర్శించారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధర ఎంత తగ్గింది? మరి దేశంలో ఎంత తగ్గించారు? అని ఆయన మోదీని నిలదీశారు. ఎక్సైజ్ టాక్స్ పేరిట వేల కోట్లు కేంద్రం వసూలు చేస్తోందని ఆయన విమర్శించారు. పెట్రోలు ధరలు అంత తగ్గినా ద్రవ్యోల్బణం ఎందుకు అదుపులోకి రాలేదని ఆయన ప్రశ్నించారు.