: చంద్రబాబుకు మంత్రి నారాయణ లిమిట్లెస్ ఏటీఎంలా వ్యవహరిస్తున్నారు: ఆళ్ల రామకృష్ణారెడ్డి
చంద్రబాబుకు లిమిట్లెస్ ఏటీఎంగా మంత్రి నారాయణ వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. మంగళగిరిలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో పోటీచేయని మంత్రి నారాయణకు రాజధాని వ్యవహారాలు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. కృష్ణా తీరంలోని కరకట్ట కబ్జాదారులను ఏమీ అనని ప్రభుత్వం, గుంటూరు జిల్లాలో రైతుల నుంచి భూములు లాక్కుంటోందని ఆయన విమర్శించారు. రాష్ట్ర రెవెన్యూ మంత్రి కేఈ రాజధాని ప్రాంతాన్ని ఒక్కసారి కూడా సందర్శించనప్పటికీ, రాజధాని పనులపై నారాయణ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. భూకేటాయింపులు, సేకరణ రెవెన్యూ శాఖ పరిధిలోని అంశాలని ఆయన గుర్తు చేశారు. ఎలా చెబితే అలా నడుచుకునే నారాయణ అయితే లాభం ఉంటుందని భావించిన బాబు, కేఈని పక్కనపెట్టి నారాయణకు రాజధాని నిర్మాణం పనుల బాధ్యతలు అప్పగించారని ఆయన పేర్కొన్నారు. జీతాలు చెల్లించేందుకు డబ్బులు లేవంటున్న బాబు, రాజధాని నిర్మాణం చేస్తానని ఎలా నమ్మబలుకుతున్నారని ఆయన నిలదీశారు. తాత్కాలిక కార్యాలయాల్లో విధుల నిర్వహణ ప్రారంభించాలని ఆయన సూచించారు.