: వరల్డ్ కప్ లో వీళ్ల ఆటను చూడొచ్చు: ఓ జాబితా తయారుచేసిన రిచర్డ్స్


క్రికెట్ చరిత్రలో కరీబియన్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ ది ప్రత్యేక స్థానం. విధ్వంసక బ్యాటింగ్ ను క్రికెట్ అభిమానులకు పరిచయం చేసింది ఈ విండీస్ ఆటగాడేనని చెప్పవచ్చు. తాజాగా, వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుని రిచర్డ్స్ ఓ జాబితా రూపొందించాడు. ఈ జాబితాలో ఉన్న ఆటగాళ్ల బ్యాటింగ్ ను టోర్నీలో తప్పక వీక్షించాల్సిందేనని అభిమానులకు సూచిస్తున్నాడు. అందులో మొదటగా సఫారీ వన్డే టీమ్ కెప్టెన్ ఏబీ డివిల్లీర్స్ ను పేర్కొన్నాడు. క్రీజులో ఎంతో సౌకర్యవంతంగా ఉంటాడని, డివిల్లీర్స్ ఆడుతుంటే తాను ఆడుతున్నట్టే ఉంటుందని తెలిపాడు. ఏ వన్డే జట్టులోనైనా అతడికి స్థానం నిరాకరించలేమని, అతని స్టయిల్ ను ఇష్టపడతానని వివరించాడు. ఇక, చిన్న వయసులోనే అగ్రశ్రేణి బ్యాట్స్ మన్ గా ఎదిగిన విరాట్ కోహ్లీలో దూకుడైన ఆటతీరు నచ్చుతుందని అన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో కోహ్లీ నమ్మదగిన ఆటగాడని అభిప్రాయపడ్డాడు. తర్వాత, క్రిస్ గేల్ పై ప్రశంసల జల్లు కురిపించాడీ విండీస్ మాజీ కెప్టెన్. తనదైన రోజున గేల్ విధ్వంసం సృష్టిస్తాడని పేర్కొన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా గేల్ ను మ్యాచ్ విన్నర్ గా పరిగణించవచ్చన్నాడు. ఆసీస్ బ్యాట్స్ మెన్ స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్ వెల్ సైతం టోర్నీలో ప్రకంపనలు సృష్టించే సత్తా ఉన్నవారేనని తెలిపాడు. గత రెండేళ్లలో స్మిత్ ఎంతో మెరుగయ్యాడని, కంటికి, చేతికి మధ్య అద్భుతమైన సమన్వయం అతడి సొంతమని కొనియాడాడు. సొంతగడ్డపై ఆడనుండడం అతడికి కలిసొచ్చే అంశమని అన్నాడు. మాక్స్ వెల్ విషయానికొస్తూ, అపారమైన ప్రతిభ అతడి సొంతమని, అయితే, ప్రతిభకు తగ్గ న్యాయం చేయడంలో విఫలమయ్యాడని రిచర్డ్స్ అభిప్రాయపడ్డాడు. తద్వారా, ఏ రోజు ఎలా ఆడతాడో చెప్పలేమన్నాడు. మాక్స్ వెల్ కంటే విధ్వంసక ఆటగాడు న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ అని చెప్పుకొచ్చాడు. సొంతగడ్డపై టోర్నీ జరగనుండడం, స్థానిక పరిస్థితులపై అవగాహన కలిగి ఉండడం లాభించే అంశమని పేర్కొన్నాడు. వరల్డ్ కప్ నెగ్గేందుకు బహుశా మెకల్లమ్ కు ఇదే చివరి అవకాశమని, అందుకే అతడు పూర్తిస్థాయిలో సామర్థ్యం ప్రదర్శంచే అవకాశాలున్నాయని తెలిపాడు. శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కరను కూడా ఈ జాబితాలో చేర్చాడు రిచర్డ్స్. గత కొన్నేళ్లుగా సంగక్కర స్థాయిలో ఏ అంతర్జాతీయ క్రికెటర్ కూడా నిలకడ ప్రదర్శించింది లేదన్నాడు. టెస్టులు, వన్డేలన్న తేడా లేకుండా పరుగులు వెల్లువెత్తించాడని కితాబిచ్చాడు. లంక జట్టుకు వరల్డ్ కప్ లో అతనే స్ఫూర్తిగా నిలుస్తాడనడంలో సందేహం అక్కర్లేదని అన్నాడు. ఇక, బౌలింగ్ విభాగంలో డేల్ స్టెయిన్, పాకిస్థాన్ పొడగరి మహ్మద్ ఇర్ఫాన్ పేస్ దాడులను తప్పక వీక్షించవచ్చని తెలిపాడు. నిలకడ, దూకుడు కలిపితే డేల్ స్టెయిన్ అవుతాడని, గత కొన్నేళ్లుగా అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ గా కొనసాగడం ఏమంత సులువైన విషయం కాదన్నాడు. ఈ వరల్డ్ కప్ లో తన జట్టు కోసం పాటుపడేందుకు మంచి అవకాశం అతని ఎదుట నిలిచి ఉందని పేర్కొన్నాడు. చివరగా, పాకిస్థాన్ కు చెందిన ఏడడుగుల పొడగరి మహ్మద్ ఇర్ఫాన్ విషయం ప్రస్తావిస్తూ, అతని ఎత్తే ప్రధాన ఆకర్షణ అని, ఆస్ట్రేలియాలోని బౌన్స పిచ్ లు అతడికి సరిపోతాయని, బ్యాట్స్ మెన్ ను ఇబ్బందులు పాల్జేస్తాడని రిచర్డ్స్ అభిప్రాయపడ్డాడు. ఈ లెఫ్టార్మ్ సీమర్ టోర్నీ మొత్తం ఫిట్ గా ఉంటే బ్యాట్స్ మెన్ కు కష్టాలు తప్పవని అన్నాడు.

  • Loading...

More Telugu News