: ఢిల్లీలో మారుతున్న సమీకరణాలు... కేజ్రీవాలే సీఎం అంటున్న సర్వేలు
దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితులు మారుతున్నాయి. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల్లో ఎవరు అధికారం చేపడతారన్న విషయంలో తొలుత అందరూ కమలానిదే హవా అనుకున్నారు. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. రెండవసారి అధికారం కోసం పోరాడుతున్న ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో పాగా వేయడం ఖాయమని తాజా సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా, అధిక ప్రాధాన్యం ఉన్న సీఎం అభ్యర్థి కేజ్రీవాలేనని సర్వేల్లో వెల్లడవుతోంది. తలీమ్ రీసెర్చ్ ఫౌండేషన్ తో ఆంగ్ల ఛానల్ జీ న్యూస్ జరిపిన సర్వేలో.... ఒకవేళ ఈరోజు గనుక ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీ 39.7 శాతం ఓట్లను దక్కించుకుంటుందట. ఇక, ఆప్ 46 శాతం ఓట్లను కైవసం చేసుకోవచ్చని, కాంగ్రెస్ కేవలం 14.3 శాతం ఓట్లే రాబట్టగలదని తెలిపింది. 49 శాతం మంది ఆప్ నేత కేజ్రీవాలే ముఖ్యమంత్రిగా సరిపోతాడని అనుకుంటుండగా, బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ కూడా ఈ పదవికి పోటీ ఇస్తారని 40 శాతం మంది తెలిపారట. 10 శాతం మంది మాత్రమే కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ సీఎం పదవికి సరిపోతాడని అనుకుంటున్నారు. ఈ క్రమంలో ఆప్ కు 34, బీజేపీకి 32 అసెంబ్లీ స్థానాలు వస్తాయని సర్వే చెబుతోంది. ఇక కేజ్రీవాల్, కిరణ్ బేడీలు ఇద్దరూ తమ తమ నియోజకవర్గాల్లో గెలవడం ఖాయమని సర్వే సూచించింది.