: తెలంగాణలో టీఆర్ఎస్ కు తప్ప మరో పార్టీకి భవిష్యత్ లేదు: కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ కు తప్ప మరో పార్టీకి భవిష్యత్తే లేదని ఆ పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటి దాకా ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్, ఇప్పుడు రాజకీయ పార్టీగా రూపాంతరం చెందిందని చెప్పారు. హైదరాబాద్ శివార్లలో ఉన్న కొంపల్లిలోని ఆర్డీ కన్వెన్షన్ హాలులో టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ, టీఆర్ఎస్ లో తెలివైన నేతలున్నారని, వీరంతా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, తెలివిగా మసలుకోవాలని సూచించారు. మనలో మనం ఘర్షణ పడరాదని, అందరం కలసి పనిచేయాలని కేసీఆర్ చెప్పారు. ఇకపై కూడా తెలంగాణలో అధికారం టీఆర్ఎస్ దే అన్న ధీమా వ్యక్తం చేశారు. వాటర్ గ్రిడ్ తో ప్రతి ఇంటికి మంచి నీరు ఇస్తామని, అర్హులైన వారందరికీ పింఛన్లు ఇస్తామని చెప్పారు. మంచినీరు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని అన్నారు. జూన్ 2 నాటికి అమరవీరుల స్థూపాలు ఏర్పాటు చేస్తామని... ప్రతి జిల్లా కేంద్రంలో అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేసేలా రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని కేసీఆర్ వెల్లడించారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు.