: ఇక దూషించవద్దు... ఆ డబ్బు తిరిగి ఇస్తా: మోహన్ లాల్
కేరళలో జరుగుతున్న జాతీయ క్రీడల ప్రారంభోత్సవ వేడుకల్లో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రదర్శనపై సామాజిక మాధ్యమంలో తీవ్ర విమర్శలు చెలరేగడంతో, ఆ కార్యక్రమానికి తాను తీసుకున్న ఫీజును వెనక్కు ఇచ్చేస్తానని ఆయన తెలిపారు. ఈ మేరకు కేరళ ప్రభుత్వానికి లేఖ రాశారు. సోషల్ మీడియాలో ఇకనైనా తనను దూషించడం ఆపాలని కోరారు. ఇంతటితో వివాదం సద్దుమణుగుతుందని భావిస్తున్నానని వివరించారు. జాతీయ క్రీడల ప్రారంభం రోజున మోహన్ లాల్ తన 'లాలిసోమ్' బృందంతో వేదికపై ప్రదర్శన ఇచ్చారు. దీనికి ఆయన రూ.1.63 కోట్లను ఫీజుగా వసూలు చేశారు. అయితే, ఈ ప్రోగ్రామ్ అత్యంత దారుణంగా ఉందని అభిమానుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ముందు రికార్డు చేసిన సంగీతాన్ని వినిపిస్తూ, పెదవులు కదిలించారని సోషల్ నెట్ వర్క్ వెబ్ సైటుల్లో వేలాది స్పందనలు వచ్చాయి. వీటిపై స్పందించిన మోహన్ లాల్ ఆ డబ్బు ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తానని తెలిపారు.