: వడ్డీ రేట్ల తగ్గింపుకు రంగం సిద్ధం... నేడే ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష
భారత రిజర్వ్ బ్యాంకు నేడు ద్రవ్య పరపతి విధానంపై సమీక్ష జరపనుంది. కీలక రేట్ల తగ్గింపు దిశగా సాగుతున్న ఊహాగానాలను నిజం చేసేలా ఆర్బీఐ నిర్ణయం వెలువడటం ఖాయమేనని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. కోల్ ఇండియా, సెయిల్ లలో పెట్టుబడుల ఉపసంహరణ నేపథ్యంలో రూ.24 వేల కోట్లకు పైగా సర్కారు నిధులను సమకూర్చుకుంది. ఈ నేపథ్యంలో 0.25 శాతం వడ్డీ రేట్ల తగ్గింపు తధ్యమన్న అంచనాలు కొనసాగుతున్నాయి. ఇక భారీ ఎత్తున నిధుల సమీకరణతో ద్రవ్యలోటు ఆందోళనలూ తగ్గాయి. తయారీ రంగంలో బలహీనతలు కొనసాగుతున్న నేపథ్యంలో వృద్ధికి ఊతమిచ్చేలా కీలక వడ్డీ రేట్ల తగ్గింపు దిశగా ఆర్బీఐ నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. అయితే కీలక రేట్లను ప్రభావితం చేసేలా ఇటీవల మార్పులేమీ చోటుచేసుకోని నేపథ్యంలో ఆర్బీఐ నిర్ణయాల్లో ఊహించిన మేర రేట్ల కోత ఉండకపోవచ్చన్న వాదనా వినిపిస్తోంది.