: వరల్డ్ కప్ గెలిచే అవకాశం 25 శాతమే!: కపిల్ దేవ్
వరల్డ్ కప్ టైటిల్ ను టీమిండియా నిలబెట్టుకుంటుందా? సగటు అభిమాని మస్తిష్కంలో మెదులుతున్న ప్రశ్న ఇది. ఆస్ట్రేలియా సిరీస్, ముక్కోణపు టోర్నీలో భారత ఆటగాళ్ల ప్రదర్శన చూసిన సీనియర్లు కూడా టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ హోదా నిలబెట్టుకోవడం అసాధ్యమని తేల్చేశారు. భారత దేశానికి తొలి వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ కపిల్ దేవ్ టీమిండియా వరల్డ్ కప్ సాధించే అవకాశం కేవలం 25 శాతమేనని అన్నారు. ఏదైనా మ్యాచ్ లో విజయం సాధించిన తరువాత ఆటగాళ్లు గుంపుగా చేరి, ఐకమత్యం ప్రదర్శించడం సాధరణమని అన్న ఆయన, మ్యాచ్ కు ముందు మైదానంలో దిగిన తరువాత గుంపుగా ఎందుకు ఆలింగనం చేసుకుంటున్నారో తనకు అర్థం కావడం లేదని అన్నారు. మైదానం బయట, డ్రెస్సింగ్ రూంలో ఏం చేస్తున్నారు? గుడ్లు తింటున్నారా? అక్కడే ఆలింగనం చేసుకోవచ్చుకదా? అని ఆయన సూచించారు. విరాట్ కోహ్లీ తన ప్రియురాలికి సెంచరీ చేసిన తరువాత ఫ్లైయింగ్ కిస్ లు ఇస్తే తప్పేముందన్న ఆయన, పరుగులేమీ చేయకుండా ఫ్లైయింగ్ కిస్ లు ఇస్తే మాత్రం సరికాదని ఆయన పేర్కొన్నారు. కాలంతో పాటు మార్పులను కూడా స్వాగతించాలని ఆయన సూచించారు.