: కాజల్ అగర్వాల్ బాహ్య సౌందర్యమే కాదు... అంత:సౌందర్యం కూడా గొప్పదే
దక్షిణాది సినీ పరిశ్రమలో తిరుగులేని తారగా వెలుగొందుతున్న అందాల భామ కాజల్ అగర్వాల్... సింగం లాంటి సినిమాతో బాలీవుడ్ లో సైతం సత్తా చాటింది. తన అందచందాలతో కుర్రకారును వెర్రెక్కించే కాజల్ ను సోషల్ మీడియాలో ఏకంగా 15 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారంటే... ఆమెకున్న క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది. అయితే, తన అందచందాలకంటే తన అంత:సౌందర్యం ఇంకా గొప్పదని కాజల్ నిరూపించింది. చదువుకోవాలన్న ఆసక్తి ఉండి... ఆర్థిక స్తోమత లేక, చదువుకు దూరమవుతున్న చిన్నారులకు చేయూతనిస్తున్న 'డెక్స్ టెరిటీ గ్లోబల్' అనే స్వచ్ఛంద సంస్థకు సౌహార్ధ్ర రాయబారి (గుడ్ విల్ అంబాసిడర్)గా వ్యవహరించేందుకు కాజల్ అగర్వాల్ అంగీకరించింది. అంతర్జాతీయ స్థాయిలో ఈ సంస్థ సేవలందిస్తోంది. తమ సంస్థ అందరికీ చేరువ కావాలంటే... కాజల్ లాంటి పాప్యులారిటీ గల వ్యక్తి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటే బాగుంటుందని భావించామని డెక్స్ టెరిటీ గ్లోబల్ తెలిపింది. దీనిపై కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ, "ఎంతో మంది చిన్నారుల భవితకు బాటలు వేసే సంస్థతో చేయి కలపడం ఎంతో సంతోషంగా ఉంది. నాకు లభించిన ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, చిన్నారులకు చేయూత అందించే క్రమంలో పూర్తి సహకారం అందిస్తా" అని చెప్పింది.