: నెల రోజుల వ్యవధిలో 1375 మందిని పొట్టన పెట్టుకున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల పైశాచిక హింస కారణంగా ఒక్క జనవరి నెలలోనే 1375 మంది మృత్యువాత పడ్డారు. ఇది ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన అధికారిక లెక్క మాత్రమే. అనధికారికంగా ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల దాష్టీకాలకు 790 మంది సాధారణ ప్రజలు మరణించగా, మిగతా వారు భద్రతా దళాలకు చెందిన సైనికులని ఐరాస వివరించింది. మరో 1500 మంది ప్రజలు, 800 మంది సైనికులు గాయపడ్డారని తెలిపింది. ఒక్క బాగ్దాద్ నగరంలోనే మృతుల సంఖ్య 250కి పైగా ఉందని పేర్కొంది. కాగా, ఇరాక్‌లోని మూడో వంతు భాగం ఉగ్రవాదుల అధీనంలోనే ఉంది. హింసతో పాటు నీరు, ఆహారం, మందులు, వైద్యం అందక కూడా మరణాలు సంభవిస్తున్నాయని ఇరాక్ లో ఐరాస సహాయ మిషన్ వెల్లడించింది.