: పావురాన్ని కాపాడబోయి విద్యుత్ షాక్ తో యువకుడి మృతి
విద్యుత్ తీగలకు చిక్కుకున్న ఓ పావురాన్ని కాపాడబోయి విద్యుత్ షాక్ కు గురై ఓ యువకుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్ కూకట్‌పల్లి పరిధిలోని బాలాజీనగర్ కాలనీలో జరిగింది. కాలనీ చుట్టుపక్కల విషాదాన్ని నింపిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన పి.సుబ్బారెడ్డి కుమారుడు గోవర్ధన్‌రెడ్డి (24) ఈ ఏడాది బీటెక్ పూర్తి చేసుకుని, యూఎస్‌లో ఎంఎస్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో, పాస్ పోర్టు పనిపై వారం రోజుల క్రితం నగరానికి వచ్చి తన బంధువు బొంతు బస్వంత్‌రెడ్డి వద్ద ఉంటున్నాడు. ఇంటి ముందు ఉన్న విద్యుత్ తీగలకు ఓ పావురం చిక్కుకుని ఉండడం గమనించి, బూజు తీసే ఇనుప కర్రకు చిన్న కత్తిని కట్టి పావురం కాళ్లకు చుట్టుకుని ఉన్న దారాన్ని కోయడానికి యత్నించాడు. ఈ క్రమంలో విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతుని వివరాలు సేకరించి, మృతదేహాన్ని గాంధి ఆసుపత్రికి తరలించారు.