: ఆ లారీలో ఏముందో?... డ్రైవర్ ను కొట్టి లారీ ఎత్తుకెళ్లిన దొంగలు!
దారి కాచి భారీ వాహనాలను ఆపి, వాటిలోని విలువైన వస్తువులను చోరీ చేస్తున్న ఘటనలు రాష్ట్రాల సరిహద్దుల్లో తరచూ జరగడం చూస్తున్నదే. విలువైన లోడుతో బయలుదేరిన వాహనాలను వెంబడించి, రాష్ట్రాల సరిహద్దుల్లో సదరు వాహనాలపై దాడులకు దిగే ముఠాలు... వాహనాలతో పరారై, అందులోని సామాగ్రిని సంచుల్లో వేసుకుని నింపాదిగా వెళ్లపోతున్న ఘటనలు బోలెడన్ని నమోదయ్యాయి. చోరీ జరిగిన తర్వాత ఏ నెలకో, రెండు నెలలకో సదరు వాహనాల ఆచూకీ తెలుస్తోంది. ఈ తరహా చోరీలు హైదరాబాదు నగరంలో ఇప్పటిదాకా జరగలేదనే చెప్పాలి. నేటి ఉదయం ఓ ముఠా ఇదే రీతిలో చోరీకి పాల్పడింది. డ్రైవర్ ను చితకబాదిన దొంగలు లారీతో ఉడాయించారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఔటర్ రింగురోడ్డుపై ఈ ఘటన జరిగింది. పెద్ద అంబర్ పేట నుంచి తుక్కుగూడ వైపు వస్తున్న లారీ (AP29 TB 115)ని దుండగులు అటకాయించారు. డ్రైవర్ను చితకబాదారు. ఆ తర్వాత లారీతో పరారయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.