: తెలంగాణ 'బిడ్డ'కు జన్మనిస్తూ, తెలుగు తల్లిని చంపేశారు... మోదీ మాటలు గుర్తు చేసిన ఉండవల్లి
తెలంగాణ విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. 'తెలంగాణ 'బిడ్డ'కు జన్మనిస్తూ, తెలుగు తల్లిని చంపేశారు' అని మోదీ స్వయంగా చేసిన వ్యాఖ్యలను ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉండవల్లి గుర్తుచేశారు. విభజన సందర్భంగా చేసిన ఎన్నో వాగ్దానాలను కేంద్రం మరచిందని విమర్శించారు. తక్షణం ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. మోదీ అదృష్టవంతుడని, ఆయన వచ్చిన తరువాత ముడిచమురు ధర బ్యారల్ కు 100 డాలర్లు తగ్గగా, కేంద్రానికి రూ.4 లక్షల కోట్లు మిగిలిందని అన్నారు. అయినా ప్రజలపై భారం తగ్గలేదని తెలిపారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలన్నీ కలసి, ప్రతిరోజూ వై.ఎస్.జగన్ పై తీవ్ర ఆరోపణలు చేస్తూ, ప్రచారం నిర్వహించి ఎన్నికలకు వెళితే కేవలం 2 శాతం ఓట్ల తేడా మాత్రమే వచ్చిందని ఆయన తెలిపారు. విపక్ష పార్టీలను కలుపుకుపోవాలని బాబుకు ఉండవల్లి సలహా ఇచ్చారు.