: ఇక మృత్యువును ముందుగానే అంచనా వేయొచ్చట!
నిజమేనండోయ్, ఇకపై మరణం ఎప్పుడు సంభవిస్తుందనే అంశాన్ని ముందుగానే అంచనా వేయొచ్చట. ఈ దిశగా సుదీర్ఘకాలంగా సాగుతున్న పరిశోధనల్లో ఎడిన్ బరో వర్సిటీ శాస్త్రవేత్తలు కొంతమేర పురోగతి సాధించారు. మనిషి డీఎన్‌ఏలో రసాయన మార్పులను బట్టి అవయవాల పనితీరు, వాటి వయసును తెలిపే జీవగడియారాన్ని వారు కనుగొన్నారు. దీని ద్వారా మనిషి జీవిత కాలాన్ని గుర్తించవచ్చని వారు అంటున్నారు. ఈ జీవ గడియారం వయసు, మనిషి వయసుకు మధ్య ఉన్న సంబంధాన్ని బట్టి వారు ఓ నమూనా తయారు చేశారు. 5 వేల మంది వృద్ధుల జీవన విధానాన్ని 14 ఏళ్ల పాటు గమనించి వారు దీనిని రూపొందించారు. దీని ప్రకారం జీవగడియారం వయసుతో సమానంగా ఉన్న వారితో పోలిస్తే వ్యక్తి వయసు కన్నా జీవగడియారం వయసు ఎక్కువగా ఉన్న వారు మరణానికి దగ్గరగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గమనించారు. ఇక ధూమపానం, మధుమేహం, గుండె జబ్బుల ద్వారా సంభవించే మరణాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. జీవన విధానం, జన్యు కారకాల్లో ఏది జీవ గడియార వయసును ప్రభావితం చేస్తుందో స్పష్టంగా తెలియరాలేదని ఎడిన్ బరో శాస్త్రవేత్త మారియోని తెలిపారు.