: రాజస్థాన్ మాజీ సీఎంకు ఢిల్లీలోనే స్వైన్ ఫ్లూ సోకిందట!
తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న ప్రాణాంతక వ్యాధి స్వైన్ ఫ్లూ రాజస్ధాన్ ను కూడా అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ వైరస్ కారణంగా 39 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ కూడా స్వైన్ ఫ్లూ బారిన పడిన సంగతి తెలిసిందే. మూడు రోజుల క్రితం అనారోగ్యానికి గురైన ఆయనకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు, గెహ్లాట్ కు స్వైన్ ఫ్లూ సోకిందని నిర్ధారించారు. దీంతో వెనువెంటనే ఆయనకు వైద్యులు చికిత్స మొదలుపెట్టారు. ‘‘సరైన సమయంలోనే చికిత్స మొదలైంది. దీంతో ఎలాంటి ఇబ్బంది లేదు’’ అని మాజీ సీఎం ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఇంతకీ, గెహ్లాట్ కు స్వైన్ ఫ్లూ వైరస్ రాష్ట్రంలో సోకలేదట. ఇటీవల ఢిల్లీ వెళ్లిన ఆయన తన పార్టీ అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో ఉండగానే ఆయనకు స్వైన్ ఫ్లూ వైరస్ సోకినట్టు వైద్యులు అనుమానిస్తున్నారు.