: బైక్ పై మూత్రం పోసిందని బుల్లెట్లు దింపాడు!
సాధారణంగా కుక్కలు వీధుల్లో స్తంభాలపై, ఆగి ఉన్న వాహనాలు తదితరాలపై మూత్ర విసర్జన చేస్తుంటాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ కంఖాల్ ప్రాంతంలో ఓ శునకం కూడా అలానే చేసింది. కనిపించిన ఓ మోటార్ సైకిల్ ను లక్ష్యంగా చేసుకుని మూత్రం పోసింది. అయితే, ఆ బైక్ వినోద్ చౌహాన్ అనే పోలీసు కానిస్టేబుల్ కు చెందినది. తన బండిపై కుక్క మూత్రం పోయడాన్ని చూసిన ఆ పోలీసులో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే తుపాకీ తీసి కుక్కకు గురిపెట్టి కాల్చగా, బుల్లెట్లు దాని కాలిని తీవ్రంగా గాయపరిచాయి. దీంతో, ఆ కుక్క 'కుయ్ కుయ్' మంటూ కూలబడిపోయింది. ఇది గమనించిన స్థానికులు కానిస్టేబుల్ ను అడ్డుకోబోయారు. అయితే, అతడు 'మీకు అనవసరం!' అంటూ గద్దించడంతో వారు వెనుకంజ వేశారు. చివరికి, ఆ గాయపడిన కుక్కను ప్రభుత్వ పశు వైద్యశాలకు తరలించి, అనంతరం జంతు పరిరక్షణకు పాటుపడే పీపుల్ ఫర్ యానిమల్స్ (పీఎఫ్ఏ) ఎన్జీవోను కలిసి విషయం వివరించారు. సంస్థ అధికారి ఒకరు డీజీపీని కలిసి కానిస్టేబుల్ దురాగతంపై సమాచారం అందించగా, డీజీపీ ఘటనపై విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం ఆ శునకం చికిత్స పొందుతోంది. కాగా, కుక్కల పట్ల వినోద్ చౌహాన్ వైరం ఈనాటిది కాదు. గతంలో అతడు ఓ కుక్కను గోనెసంచిలో వేసి మూతి బిగించి, దానిని బైక్ కు కట్టి రోడ్డుపై ఈడ్చెకెళ్లాడట. దాంతో, తీవ్రగాయాలపాలైన ఆ వీధి కుక్క ప్రాణాలు విడిచిందని పీఎఫ్ఏ సభ్యురాలు మానవి భట్ వెల్లడించారు.