: శీలానికి ఖరీదు కట్టిన పంచాయతీ పెద్దలు
శీలానికి ఖరీదు కడుతున్నారు. సమాజంలో అట్టడుగు వర్గాలకు చెందిన మహిళలపై జరుగుతున్న దాష్టీకాల్ని డబ్బుతో కప్పిపెట్టేస్తున్నారు. తాజాగా బీహార్ లోని కటిహర్ జిల్లా కోదా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. పని కోసం పంచాయతీ కార్యాలయానికి వెళ్లిన ఓ దళిత మహిళపై ప్రకాశ్, నరేష్ రవిదాస్ అనే వ్యక్తులు అత్యాచారానికి తెగబడ్డారు. దీంతో పంచాయతీ పెద్దలు ఆమె శీలానికి 41 వేల రూపాయల ఖరీదు కట్టారు. ఈ డబ్బులు తీసుకుని అత్యాచార ఘటనను మరచిపోవాలని, పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని పంచాయతీ పెద్దలు బాధితురాలిని ఆదేశించారు. దీంతో ఆమె నిరసన వ్యక్తం చేయడంతో, ఓ నిందితుడు ఆమె భర్తకు నిప్పంటించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు నరేష్ రవిదాస్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు ప్రకాశ్ పరారీలో ఉన్నాడు.