: ఆరోగ్యం బాగాలేకపోయినా, చికిత్సకు స్పందిస్తున్న మూవీ మొఘల్ రామానాయుడు
గడచిన రెండు మూడు నెలలుగా మూవీ మొఘల్ రామానాయుడి ఆరోగ్యంపై టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. "దాదాపు 13 సంవత్సరాల క్రితం ఆయనకు ప్రొస్టేట్ కేన్సర్ సోకింది. అప్పట్లో చికిత్స తరువాత తగ్గిన వ్యాధి, ఇప్పుడు మళ్ళీ తిరగబెట్టింది" అన్నది ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. ఆయన శరీరంపై అమిత ప్రభావం చూపే ఇంగ్లీషు మందులను ఆపి ప్రత్యామ్నాయ మందులను ఇవ్వాలని రామానాయుడు కుటుంబం నిర్ణయించినట్టు తెలిసింది. సినీ నటుడు, డాక్టర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఈ చికిత్స జరుగుతుండగా, రామానాయుడు బాగానే స్పందిస్తున్నారనీ, ఆరోగ్య పరంగా బెటర్ మెంట్ కనిపిస్తోందని తెలుస్తోంది. ''డాడీకి బాగానే ఉంది. ఆయన మనసంతా సినిమాలపైనే ఉంది. ప్రతిరోజూ సురేశ్ తో వైజాగ్ లో స్టూడియో డెవలప్ చేసే విషయం గురించి మాట్లాడుతుంటారు'' అని హీరో వెంకటేశ్ ఓ ఆంగ్ల దినపత్రికకు తెలిపారు.