: అగ్ని-5 విజయవంతం... బలోపేతం కానున్న భారత సైనిక సామర్థ్యం
భారతదేశ దూర శ్రేణి క్షిపణి అగ్ని-5 ప్రయోగం విజయవంతం అయింది. ఒడిశా తీరంలోని వీలర్ ఐలండ్ నుంచి ఈ ఉదయం 8.06 గంటలకు దీన్ని ప్రయోగించారు. ఇంటెగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ లోని లాంచ్ కాంప్లెక్స్-4 నుంచి దీని ప్రయోగం జరిగింది. ఇప్పటి వరకు ఈ క్షిపణిని మూడు సార్లు ప్రయోగించగా... అన్నిసార్లు ఇది విజయవంతం అయింది. వివిధ ప్రాంతాల్లోని రాడార్లలో నమోదైన డేటాను సమీక్షించిన తర్వాత ప్రయోగ ఫలితంపై పూర్తి అంచనాకు వస్తారు. త్రీ-స్టేజ్ మిస్సైల్ అయిన అగ్ని-5... 17 మీటర్ల పొడవు, 50 టన్నుల బరువు కలిగి ఉంటుంది. 5వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను అగ్ని-5 పక్కాగా ఛేదించగలదు. కానీ, దీని రేంజ్ 8 వేల కిలోమీటర్లకు పైగా ఉంటుందనేది అనధికారిక సమాచారం. మరికొన్ని ప్రయోగాల అనంతరం అగ్ని-5ని భద్రతాదళాలకు అప్పగించనున్నారు. ఇప్పటికే అగ్ని-1, అగ్ని-2, అగ్ని-3, అగ్ని-4 క్షిపణులు భారత అమ్ముల పొదిలో ఉన్నాయి.